విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాలలో ఎక్కువగా కనిపించిన నటుల్లో మనోజ్ బాజ్‌పాయ్ ఒకరు. తన 30 ఏళ్ల కెరీర్‌లో కొన్ని సందర్భాల్లో అనుమానాలు ఇబ్బందిపెట్టాయని అన్నారు. ఇండిపెండెంట్ సినిమాలకు నూకలు చెల్లాయని కూడా కుమిలిపోయినట్టు తెలిపారు. అయితే సరిగ్గా అలాంటి సమయంలోనే ఓటీటీ ఆదుకుందని అన్నారు. 2019లో ది ఫ్యామిలీ మేన్ సీరీస్‌తో ఓటీటీలో అడుగుపెట్టారు మనోజ్ బాజ్‌పాయ్. ``నటుడిగా కంటిన్యూ అవుతున్న సమయంలో ఎక్కడో నమ్మకాన్ని కోల్పోయాను. ఇండిపెండెంట్ సినిమాకు కాలం చెల్లిందనే అనుకున్నా. జనాలు ఆ సినిమాల మీద ఆసక్తి చూపకపోవడంతో, ఇక అంతే సంగతులు అని అనిపించింది. ఇండిపెండెంట్ సినిమాకు సపోర్ట్ చేయడం మంచిదా? కాదా? అనే అనుమానాలు కూడా నాకు వచ్చాయి. కానీ ఓటీటీ వాటన్నిటినీ తుడిచిపెట్టింది. ఫ్యామిలీమేన్‌కి ముందు కూడా చాలా మంది చాలా సీరీస్‌లకోసం అడిగారు. అయితే దాని మీద నాకు అప్పట్లో అవగాహన లేదు.
అందుకే ఒప్పుకోలేదు. కానీ ఫ్యామిలీ మేన్ ఫస్ట్ సీజన్ సక్సెస్ ఎవరూ ఊహించనిది. ఆ సక్సెస్ చూసి చాలా మంది ఇండిపెండెంట్ సినిమాలను ఓటీటీల్లో విడుదల చేసి ధైర్యంగా ముందుకు నడిచారు`` అని అన్నారు. మనోజ్ బాజ్‌పాయ్ ఇప్పుడు పలు సీరీస్‌లలో నటిస్తున్నారు. ``నాకే కాదు, చాలా మంది హోప్ ఇచ్చింది ఓటీటీ. నచ్చిన సినిమాలను చేసినా ఆత్మసంతృప్తి మిగులుతుందని ప్రూవ్ చేసింది. కంటెంట్ నమ్మి చేసే సినిమాలను ఆడియన్స్ ఆదరిస్తారనే భరోసాఇచ్చింది. అందుకే మేకర్స్ కూడా థియేటర్లను దృష్టిలో పెట్టుకుని మాత్రమే కాదు, మంచి కంటెంట్‌ని ఆదరించే వారి కోసం కూడా సినిమాలు చేస్తున్నారు`` అని అన్నారు. మనోజ్ బాజ్‌పాయి రీసెంట్ ప్రాజెక్ట్ ది వయల్ - ఇండియాస్ వ్యాక్సిన్ స్టోరీ. ఇందులో మనోజ్ నెరేటర్ పాత్ర పోషించారు.